యూసుఫ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు కోహ్లీ షాక్.. మ్యాచ్ ఓడిన తర్వాత బాధను బయటపెట్టాడు..!

నిన్నటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బెంగళూరుపై 5 పరుగుల తేడాతో గెలిచింది. కోహ్లీ వికెట్ తీయడం ఈ మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అది కూడా యూసుఫ్ పఠాన్ అద్భుతమైన క్యాచ్ అందుకుని కోహ్లీని అవుట్ చేశాడు. షకీబ్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో విరాట్ బంతిని కట్ చేయబోయాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బంతి గాల్లోకి లేచింది. థర్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్న పఠాన్ వెనక్కి వెళ్తూ.. ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కోహ్లీ అవుట్ అవ్వడం.. ఆ తర్వాత డివిలియర్స్ కూడా తొందరగా పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ మ్యాచ్ ను దూరం చేసుకుంది. చివర్లో గ్రాండ్హోమ్-మన్ దీప్ సింగ్ విజయంపై ఆశలు రేపినప్పటికీ.. చివరికి సన్ రైజర్స్ బౌలింగ్ ముందు తేలిపోయారు.

ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ తమ జట్టును నిందించుకున్నాడు. ఈ మ్యాచ్ ఓడిపోవడానికి తమకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పాడు. 60 రన్స్ కు పైగా మొదటి పది ఓవర్లలో కొట్టినా కూడా తాము విజయం సాధించలేకపోయామంటే అది తమ చేతకానితనమేనని చెప్పుకొచ్చాడు కోహ్లీ. వికెట్లను పారేసుకొని మ్యాచ్ ను వాళ్ళ చేతిలో పెట్టామని అన్నాడు. చేతిలో నాలుగు వికెట్లు ఉంచుకుని కూడా 5 పరుగులు సాధించలేకపోయామని అన్నాడు. చెత్త షాట్లు ఆడి వికెట్లను పారేసుకున్నామని, పిచ్ చాలా స్లోగా ఉందని అన్నాడు. కాస్తంత కుదురుగా ఆడితే, పరుగులు సులువుగా సాధించవచ్చని మన్ దీప్, గ్రాండ్ హోమ్ ల జోడీ నిరూపించిందని అన్నాడు. బౌలర్లు కనీసం 10 నుంచి 15 పరుగులు తక్కువగా ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచిందని చెప్పడం కన్నా, తాము చేజేతులా ఓడిపోయామని అనడం సబబని కోహ్లీ తన బాధను వెళ్ళగక్కాడు. జట్టులో విజయం కోసం బలంగా పోరాడే వాళ్ళు ఉండాలని.. సన్ రైజర్స్ జట్టులో అలాంటి ఆటగాళ్ళు ఉన్నారని.. కానీ తమ జట్టులో అలాంటి వాళ్ళు తక్కువగా ఉన్నారని.. అందుకే ఈ ఏడాది వాళ్ళ సీజన్ అలా ఉందని.. తమ సీజన్ ఇలా అయిందని చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here