ఆ సిక్స‌ర్ దెబ్బ‌కు స్టేడియం బ‌య‌ట పార్క్ చేసిన కారు అద్దం భ‌ళ్లుమంది!

హ‌రారే: క్రికెట్ మ్యాచ్‌ల‌ల్లో సిక్స‌ర్లు స‌ర్వ సాధార‌ణం. బౌల‌ర్ సంధించే బాల్ ఏ మాత్రం తేడాగా వ‌చ్చినా, దాన్ని ఫెన్సింగ్ దాటిస్తుంటారు బ్యాట్స్‌మెన్లు. అలాంటి కొన్ని సిక్స‌ర్లు స్టేడియం అవ‌త‌ల ప‌డిన సంద‌ర్భాల‌ను కూడా మ‌నం చూశాం.

ఈ సిక్స్ మాత్రం చాలా అరుదు. బ్యాట్స్‌మెన్ కొట్టిన ఆ సిక్స‌ర్ స్టేడియం దాటి అవ‌త‌ల ప‌డింది. స్టేడియం గోడ ప‌క్క‌న‌ పార్క్ చేసిన కారు అద్దంపై ప‌డేట‌ప్ప‌టికీ భ‌ళ్లుమంటూ ప‌గిలింది కారు విండ్ షీల్డ్‌.

ఆ కారెవ‌రిదో తెలియ‌దు గానీ.. రోడ్డు మీద వెళ్లే ఓ వ్య‌క్తి ఆ బాల్‌ను మ‌ళ్లీ స్టేడియం లోప‌లికి విసిరేశాడు. ఆ బ్యాట్స్‌మెన్ సికింద‌ర్ రెజా. జింబాబ్వే మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్‌. ఈ సిక్స్‌తో అత‌ను సెంచ‌రీ కూడా పూర్తి చేసుకోవ‌డం విశేషం.

జింబాబ్వేలో జ‌రుగుతున్న ప్ర‌పంచక‌ప్ క్రికెట్ క్వాలిఫ‌యింగ్ మ్యాచ్‌లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే జ‌ట్టు.. నేపాల్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 50 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 380 ప‌రుగులు చేసింది.

నేపాల్ ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 264 మాత్ర‌మే చేసి, ఓట‌మి పాలైంది. అయిద‌వ వికెట్‌కు టేల‌ర్‌, సికింద‌ర్ 173 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని అందించారు. ఏడు ఫోర్లు, ఆరు సిక్స‌ర్లతో సికింద‌ర్ సెంచ‌రీ పూర్తి చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here